వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ‘‘విజయసాయిరెడ్డి జగన్ అత్యంత సన్నిహితుడు. ఆయన చెప్పిన ప్రతి మాటను పాటించేవారు. జగన్ అడిగింది చేయడం, అవసరమైతే ఎవరినైనా తిట్టడం ఆయన కర్తవ్యం. అయితే, ఇప్పుడు ఆయన పార్టీని విడిచిపెట్టడం చిన్న విషయం కాదు’’ అని వ్యాఖ్యానించారు.
జగన్ విశ్వసనీయత కోల్పోయారంటూ షర్మిల విమర్శలు
షర్మిల మాట్లాడుతూ, ‘‘జగన్ విశ్వసనీయత కోల్పోయారు. అందుకే సన్నిహితులు, ప్రాణం పెట్టిన వారు కూడా పార్టీని విడిచి వెళ్తున్నారు. జగన్ తన దగ్గరగా ఉన్నవారిని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. విజయసాయిరెడ్డి వంటి వ్యక్తి బయటకు వచ్చి నిజాలు చెప్పాలంటూ’’ షర్మిల సూచించారు. షర్మిల మరో కీలకమైన వ్యాఖ్య చేస్తూ, ‘‘వివేకా హత్యపై విజయసాయి కొన్ని నిజాలు బయటపెట్టినందుకు సంతోషం. మిగతా విషయాలను కూడా వెల్లడించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నా’’ అని అన్నారు. జగన్ భాజపాకు దత్తపుత్రుడిగా మారిపోయారని, ఆయన నేతృత్వంపై నమ్మకం కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతుందని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.






