పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి పిఠాపురమే అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గత విషయం, తమకు అతనిపై గౌరవముందని స్పష్టం చేశారు.
పిఠాపురం టీడీపీ నేత వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వర్మకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. జనసేన ఆవిర్భావ సభ ఈనెల 14న చిత్రాడలో సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని తెలిపారు. సభ అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమం చేపడతామని, పర్యావరణంపై తమ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతుందని వివరించారు. ఇదిలా ఉంటే.. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ సీఎం చంద్రబాబు నిర్ణయానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడం గురించి మాట్లాడుతూ, రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు సహజమని పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలోనే పదవుల పంపిణీ సులభం కాదని, రాష్ట్రస్థాయిలో అయితే మరింత సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. 23 ఏళ్లుగా చంద్రబాబుతో కలిసి పని చేసిన అనుభవంతో, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆదరణగా స్వీకరిస్తానన్నారు. లోకేశ్ ఆదేశాలను కూడా పూర్తి నిబద్ధతతో పాటిస్తామని స్పష్టం చేశారు.





