ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లో అడుగుపెట్టి రాష్ట్ర సత్తా చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకొని, తమ సంస్థలు, ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘ఆంధ్రా ప్రెన్యూర్స్’ అనే పేరును నిలబెట్టాలని ఆయన సూచించారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆంత్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు.
రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను యువ పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతూ, విశాఖ-చెన్నై మధ్య నాలుగు లేన్ల రైల్వేలైన్ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారతాయని తెలిపారు. భవిష్యత్తులో అమరావతి-హైదరాబాద్-బెంగళూరు-చెన్నై దేశంలోనే అతిపెద్ద కారిడార్‌గా మారుతుందని చెప్పారు. అలాగే, విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
మౌలిక వసతుల కల్పన
పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని సీఎం అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు, వివిధ దేశాల పేర్లతో పార్కులు ఏర్పాటు చేసి సుందరీకరణ చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు.





