- పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కోచింగ్ ఇవ్వనుంది.
- విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా ఈ కోచింగ్ అందిస్తారు.
- అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఈ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, అర్హులైన అభ్యర్థుల నుంచి త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తారని మంత్రి తెలిపారు. ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వంటి వివిధ పోటీ పరీక్షలకు మార్గదర్శకత్వం, శిక్షణ అందిస్తారు. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని డాక్టర్ స్వామి కోరారు.
అభివృద్ధి పనులపై సమీక్ష
ఒంగోలులోని తుర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి డోలా పచ్చదనం, పరిశుభ్రతను మెరుగుపరచడంపై చర్చించారు. ప్రజల ఫిర్యాదులపై, ముఖ్యంగా రైతుల సమస్యలు, ఆన్‌లైన్ ప్రక్రియల్లో ఆలస్యాలపై అధికారులు వెంటనే, చిత్తశుద్ధితో స్పందించాలని ఆదేశించారు. శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని, మురుగునీటి వ్యవస్థలను శుభ్రం చేయడానికి, అన్ని వీధి దీపాలు పనిచేసేలా చూడటానికి చురుకైన విధానాన్ని అవలంబించాలని డోలా నొక్కి చెప్పారు. అధికారులు గ్రామ మౌలిక సదుపాయాలను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సిన అవసరం రాకుండా చూడాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోరారు. “పనులు చిత్తశుద్ధితో చేస్తే, ప్రభుత్వానికి ప్రజల మన్నన లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.





