- రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ వర్సిటీ వీసీగా ఎంపిక.
- పైరవీలు, సిఫారసులు లేకుండా ప్రతిభావంతులకే అవకాశం కల్పించిన ప్రభుత్వం.
కూటమి ప్రభుత్వం ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. భర్తీలో పైరవీలు, సిఫారసులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ప్రతిభావంతులకే అవకాశమిచ్చింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. గతంలో రాజకీయ నేపథ్యం, సిఫారసులున్న వారే ఎక్కువగా వీసీలుగా ఎంపికయ్యేవారు. ఈసారి ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా సమర్థులైన విద్యారంగ నిపుణులను గుర్తించి ప్రభుత్వం సముచిత ప్రాధాన్యమిచ్చింది.
కొత్త వీసీల నియామకం కోసం కసరత్తులు
విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల ఎంపిక కోసం దాదాపు ఆరు నెలలపాటు మంత్రి నారా లోకేశ్ కసరత్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 17 వర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. అన్నింటికి కలిపి 2వేల దరఖాస్తులు రాగా, 512 మందికిపైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. వీటన్నింటిని వడపోసి మొదటి విడతగా తొమ్మిది వీసీ పోస్టులను భర్తీ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. కొత్తగా నియమితులైన వీసీలలో నలుగురు ఇంజినీరింగ్, ముగ్గురు సైన్స్, ఇద్దరు సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులు, నిపుణులు ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే నలుగురు ఓసీలు, ముగ్గురు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.





