ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరఫున న్యాయవాది మోహిత్‌రావు ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో మంగళవారం దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం పొందేందుకు కేటీఆర్ ఈ పిటిషన్‌ను వేశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం హైకోర్టు తీర్పు అనంతరం అప్రమత్తమై, సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరుగుతే తమ వాదన వినాలని కేవియట్ ద్వారా కోరింది.





