‘‘గేమ్ ఛేంజర్’లో నేను పోషించిన పార్వతి పాత్ర నా కెరీర్‌లో ది బెస్ట్’’ అని నటి అంజలి తెలిపారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో అంజలి, కియారా అడ్వాణీ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, ఎస్.జె. సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాపై అంజలి తన అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. ‘‘పార్వతి పాత్రకు మా అమ్మ పేరు అదే కావడం వల్ల ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
ఈ పాత్ర నన్ను చాలా ఛాలెంజ్ చేసింది. కొన్ని సన్నివేశాల్లో శంకర్‌గారు నా అభినయాన్ని ప్రశంసించడం జీవితాంతం గుర్తుంటుంది. ఈ పాత్రకు జాతీయ అవార్డు వచ్చేంత స్కోప్ ఉందని అందరూ అంటున్నారు. అది నిజమైతే నాకు ఇదే అతిపెద్ద విజయంగా ఉంటుంది. చిరంజీవిగారు నా నటనను మెచ్చుకున్నారని తెలియడం మాత్రం ఇప్పటికే నాకు పెద్ద అవార్డు.’’ అని అంజలి తెలిపారు. ‘గేమ్ ఛేంజర్’తో తాను మాత్రమే కాకుండా, చిత్రబృందంలోని అందరికీ మంచి గుర్తింపు వస్తుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.





