తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆప్కాబ్ ఛైర్మన్ పదవికి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పశ్చిమగోదావరి పర్యటనలో మంత్రి నారా లోకేశ్ గన్నిని ‘‘ఆప్కాబ్ ఛైర్మన్’’ అని ఉద్దేశించి మాట్లాడటంతో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలోనే గన్నికి హామీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు సీటు జనసేనకు కేటాయించడంతో గన్ని సీటు త్యాగం చేశారు. ఈ పరిణామంలో ఆయనకు కీలకమైన పదవి కేటాయిస్తామని తెదేపా హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో గన్నికి అవకాశం లభించలేదు. లోకేశ్ వ్యాఖ్యలతో గన్ని వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సంధర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి భీమడోలు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ అంశంపై స్పందించిన గన్ని, పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని శిరోధార్యంగా స్వీకరిస్తానని తెలిపారు.






