ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగకు ముందే పందేలు హడావుడిగా ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రాత్రి వేళల్లో పందేలు నిర్వహిస్తూ, భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి.
రాత్రి 7 గంటల తర్వాత..
ఆర్థికంగా బలమైన వారికి మాత్రమే నిర్వాహకులు సమాచారం ఇస్తున్నారు. రాత్రి 7 గంటల తర్వాత ట్రాక్టర్లతో చదును చేసి, లైట్లు ఏర్పాటు చేసి తెల్లారేలోగా పందేలు ముగిస్తున్నారు. గుర్తింపు కార్డులు ఇస్తూ, వీడియోలు, ఫోటోలు తీసేందుకు ఫోన్లు ముందుగానే తీసుకుంటున్నారు. పందేల్లో ఒక్కో పందేనికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకూ కాస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. కోళ్లను నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా కొనుగోలు చేస్తున్నారు. పందేల నిర్వహణను కట్టడి చేస్తామని డీఐజీ అశోక్‌కుమార్ ప్రకటించినప్పటికీ, స్థానిక స్థాయిలో పోలీసులు చర్యలు పెద్దగా కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.





