ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లలో, కార్యాలయాల్లో ఆదాయపన్ను (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కార్యాలయాలు, ‘పుష్ప 2’ చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ఏకకాలంలో విస్తృత సోదాలు
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని దిల్ రాజు ఇళ్లతో పాటు, ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సతీమణి వైగా రెడ్డిని ఐటీ అధికారులు కారులో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం 8 చోట్ల 55 బృందాలతో ఈ సోదాలు జరుగుతున్నాయి. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.





