- కలకత్తా లా కాలేజీ గ్యాంగ్‌రేప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్.. వారి ఫోన్లను స్వాధీనం
- బాధితురాలి మెడికల్ రిపోర్ట్‌లో “బలవంతపు లైంగిక దాడి, కొరికిన గాయాలు, గోర్ల గీతలు”
కలకత్తాలోని సౌత్ కలకత్తా లా కాలేజీలో జూన్ 25న జరిగిన గ్యాంగ్‌రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కలకత్తాను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది, గత ఏడాది ఆర్జి కార్ మెడికల్ కాలేజీలో జరిగిన మెడికల్ ట్రైనీ రేప్ కేసు తర్వాత ఇది మరో విషాదకరమైన సంఘటన. లా కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థినిని కళాశాల ప్రాంగణంలోనే ఒక మాజీ విద్యార్థి, ఇద్దరు సీనియర్ విద్యార్థులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాతో సహా ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.
వైద్య పరీక్షల్లో దారుణ వాస్తవాలు!
24 ఏళ్ల బాధితురాలికి గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె శరీరంపై బలవంతపు లైంగిక దాడి, కొరికిన గాయాలు, గోర్ల గీతలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. నిందితుడైన మిశ్రా, ఒక క్రిమినల్ లాయర్ అని, అతనే లా విద్యార్థినిపై అత్యాచారం చేశాడని, మిగతా ఇద్దరు నిందితులు గది బయట కాపలా ఉన్నారని ఆ అధికారి చెప్పారు. చీఫ్ పోలీస్ ప్రాసిక్యూటర్ సౌరిన్ ఘోషల్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సుప్రీం కోర్ట్ తీర్పును ఉటంకిస్తూ, గ్యాంగ్‌రేప్ కేసులో అందరూ ఆ నేరంలో పాలుపంచుకోకపోయినా, సంబంధం ఉన్న అందరూ బాధ్యులే అని అన్నారు. “ఈ కేసులో మరో ఇద్దరు అత్యాచారానికి సహాయపడ్డారు. కాబట్టి ఇది గ్యాంగ్‌రేప్ కేసు, వారు కూడా ఈ కేసులో నిందితులే” అని ఘోషల్ స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో రాజకీయ రగడ: న్యాయం జరుగుతుందన్న TMC!
ఈ కేసు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య రాజకీయ వాగ్వాదం మొదలైంది. అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, ఈ కేసులో “న్యాయం జరుగుతుంది” అని హామీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పాంజా శుక్రవారం ఈ గ్యాంగ్‌రేప్ కేసుపై ఒక ప్రెస్మీట్లో మాట్లాడారు. ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, తక్షణ చర్యలు తీసుకున్నారని తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆమె తెలియజేశారు.





