- కృష్ణా నది బ్రిడ్జిపై నుంచి పడిన వ్యక్తిని స్థానికులు కాపాడారు.
- భార్య ఫోటో తీసుకుంటున్నట్లు నటించి, నదిలోకి నెట్టిందని భర్త ఆరోపణ.
రాయచూరు తాలూకా గార్జాపూర్ దగ్గర కృష్ణా నదిలో ఒక నాటకీయ ఘటన జరిగింది. వంతెన పైనుంచి నదిలో పడిన ఒక వ్యక్తిని స్థానికులు రక్షించారు. అయితే, నదిలోంచి బయటపడగానే, తన భార్యే కావాలని నదిలోకి నెట్టిందని అతను ఆరోపించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శక్తి నగర్‌కు చెందిన సూరజ్, యాద్గిర్ జిల్లా వడగేరాకు చెందిన నీతూ (పేర్లు మార్చాం) కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వీరు ఫోటోలు తీసుకోవడానికి వంతెనపై ఆగారు. సూరజ్ చెప్పిన ప్రకారం, అతను తన భార్య ఫోటోలు తీశాక, తన ఫోటోలు కూడా తీయమని ఆమెను కోరాడు. వంతెన చివరిలో అతను నిలబడినప్పుడు, ఫోటో తీస్తున్నట్లు నటిస్తూనే తన భార్య తనను నదిలోకి నెట్టిందని సూరజ్ ఆరోపించారు.
హై డ్రామా!!
ఆ సమయంలో కృష్ణా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉంది. నీటి ప్రవాహానికి సూరజ్ కొట్టుకుపోయారు. అతను నది మధ్యలో ఉన్న రాళ్లను పట్టుకొని సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని స్థానికులు, అటుగా వెళ్లేవారు, మత్స్యకారులు అతని సహాయానికి వచ్చారు. రెండు గంటల పాటు తాడు సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి అతన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే, సూరజ్ నీతూను నదిలోకి కావాలనే నెట్టిందని ఆరోపించారు. అయితే, ఆమె ఈ ఆరోపణలను ఖండించింది. తర్వాత, దంపతులిద్దరూ కొద్దిసేపు వాదించుకున్నారు. ఆ తర్వాత మోటార్‌సైకిల్‌పై కలిసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు. అక్కడున్న వారిలో ఒకరు ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.





