- కూటమి హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి
- వెన్ను నొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరుకాలేకపోయానని వివరణ
రాష్ట్రంలోని మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ, ప్రజలకు న్యాయం చేయాలని కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని, అప్పుల భారం పెరిగినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం హామీల అమలుకు వెనుకంజ వేయదన్నారు. తనకు తీవ్ర వెన్నునొప్పి కారణంగా కొన్ని ముఖ్యమైన భేటీలకు హాజరుకాలేకపోయానని పవన్ వివరించారు. ఇప్పటికీ నొప్పి బాధిస్తూనే ఉందని, అయినా తన శాఖ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైనవని అన్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ప్రధాని మోదీ నాయకత్వంపై మరింత విశ్వాసాన్ని పెంచిందని పవన్ అన్నారు. ఈ విజయం చరిత్రాత్మకమని, NDA ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు.





