- రాజంపేట జైల్లో ఉన్న పోసానిపై మూడు పీటీ వారెంట్లు
- పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించిన జైలు అధికారులు
వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట, అల్లూరి, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందజేశారు. దీంతో పోసానిని ముందుగా ఎవరికప్పగించాలనే అంశంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. అంతిమంగా, ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. నరసరావుపేట టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక పోసాని కృష్ణమురళికి ఛాతీలో నొప్పి వచ్చినట్లు జైలు అధికారులకు తెలియజేశారు. దీంతో రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం రాజంపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.





