భారత క్రికెట్‌లో కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఛాపెల్-గంగూలీ, కుంబ్లే-కోహ్లి వంటి సంఘటనలు భారత్ క్రికెట్‌ను కుదిపేస్తే, ఇప్పుడు గంభీర్, రోహిత్ శర్మ మధ్య విభేదాలు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. వరుస పరాజయాల నేపథ్యంలో టీమ్‌ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మరింత హీట్ ఎక్కుతోంది. సిడ్నీ టెస్టుకు ముందు గురువారం జరిగిన పిచ్ పరిశీలన సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ బుమ్రాతో కలిసి వచ్చాడు.. రోహిత్ శర్మ తర్వాత కనిపించాడు. అక్కడ కోచ్-కెప్టెన్ మధ్య పెద్దగా సంభాషణ లేకపోవడం గమనార్హం. విలేకర్ల సమావేశానికి సాధారణంగా కెప్టెన్ హాజరవ్వాలి. కానీ, ఈసారి గంభీర్ హాజరవ్వడం.. రోహిత్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం విశ్లేషకుల్లో మరింత అనుమానాన్ని రేకెత్తించాయి.
రోహిత్ భవిష్యత్‌పై సందిగ్ధత
ఫామ్‌లో లేకపోవడం, గంభీర్ భవిష్య ప్రణాళికల్లో రోహిత్ శర్మకి చోటు లేకపోవడం టీమ్‌లో అంతర్గత సమస్యలకు దారి తీస్తున్నాయి. మరోవైపు రవి శాస్త్రి వాఖ్యలు ఇలా ఉన్నాయి… ‘‘రోహిత్ తన కెరీర్‌పై తానే నిర్ణయం తీసుకోవాలి. అతను రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆశ్చర్యపడను. నేటి పరిస్థితుల్లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు జట్టులోకి రావడానికి అవకాశం కల్పించాలి’’ . ఈ తరహా విభేదాలు భారత క్రికెట్‌లో కొత్త సంక్షోభానికి నాందిగా మారుతున్నాయా?? వేచి చూడాల్సిందే!!






