- తండ్రి పేరు గర్వంగా నిలిపేందుకు ‘ఎస్‌పీబీ చరణ్’గా మారిన చరణ్
- వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై ఆసక్తికర విషయాలు షేర్ చేసిన గాయకుడు
గాయకుడు, నటుడు, నిర్మాతగా తనదైన మార్గంలో సాగుతున్న ఎస్‌పీబీ చరణ్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘నా జీవితంలో గెలుపూ, ఓటమీ చూశాను. 2000లో తొలిసారి రూ.75 లక్షలు పెట్టి సినిమా నిర్మించా, కానీ అంతా కోల్పోయాను’’ అని ఆయన చెప్పారు. 2005లో భార్యతో విడాకులు తీసుకున్న చరణ్ తన కవల పిల్లలు జాహ్నవి, మయూక న్యూయార్క్‌లో ఉంటున్నారని, వారిని కలిసేందుకు ప్రతి ఏడాది వెళ్లేలా చూస్తానన్నారు. కెరీర్‌లో నెమ్మదిగా సాగుతున్న సమయంలో తల్లి మాటలు బాధించాయని, తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని వెల్లడించారు. అయితే ఆ కష్ట సమయంలో దర్శకుడు కె. బాలచందర్ ఇచ్చిన అవకాశం తన జీవితాన్ని మార్చిందని చెప్పారు.
హీరో అజిత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చరణ్, ‘‘మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. దర్శకుడు వాసంత్ మా నాన్నను సంప్రదించగా, నేను అమెరికాలో ఉండటంతో అజిత్‌ను సూచించారు. అలా ఆయన హీరో అయ్యారు’’ అన్నారు. గాయకుడిగా ఎక్కడ ఎక్కడ ఉందో తారకా.., చెప్పవే ప్రేమా.., ఉయ్యాలో ఉయ్యాల.. వంటి పలు హిట్ సాంగ్స్ పాడిన చరణ్, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.





