- టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ విజయవంతమైంది.
- ఈ విషయాన్ని అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. త్వరలోనే మైదానంలోకి వస్తానని తెలిపాడు.
కొంతకాలంగా అతడిని బాధపెడుతున్న స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని సూర్యకుమార్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా పొత్తికడుపులో కుడివైపున ఈ స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడుతున్నాడు. ఆపరేషన్ కోసమే ఇటీవలే జర్మనీ వెళ్లాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. “లైఫ్ అప్‌డేట్: కుడివైపు పొత్తికడుపు ప్రాంతంలో స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. త్వరగా మైదానంలోకి రావాలని ఉంది” అని బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కాగా, సూర్యకుమార్ యాదవ్‌కు ఇది మూడో సర్జరీ. 2023లో అతని మడమకు, 2024లోనూ హెర్నియాకు ఆపరేషన్ జరిగింది. రెండు వారాల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతను పునరావాసం (రిహాబిలిటేషన్) ప్రారంభించనున్నాడు.
సూర్యకుమార్ ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో చాలా కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఏకంగా 717 పరుగులు చేశాడు. ఓపెనర్ కాని బ్యాటర్ ఐపీఎల్ టోర్నమెంట్‌లో చేసిన అత్యధిక పరుగులు ఇవే. అలాగే, టీ20ల్లో వరుసగా 16 సార్లు 25 కంటే ఎక్కువ స్కోర్లు చేసి రికార్డు సృష్టించాడు. ఈ ఐపీఎల్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా నిలిచాడు. త్వరలోనే మైదానంలో సూర్యకుమార్ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





