- అక్రమ మైనింగ్, భూకబ్జాలపై విచారణకు ప్రత్యేక బృందం
- సిట్ ఏర్పాటు, 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేపట్టనుంది. పోలీసు సీనియర్ అధికారి నేతృత్వంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అక్రమ మైనింగ్, భూకబ్జాలపై దర్యాప్తు
వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్, భూకబ్జాలు, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. గ్రావెల్, భవన నిర్మాణ కంకర అక్రమ మైనింగ్ ద్వారా రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది. పానకాల చెరువు వద్ద కూడా పెద్ద ఎత్తున మట్టితవ్వకాలు జరిపి రూ.100 కోట్ల లబ్ది పొందారని వివరించింది. సిట్ సభ్యులుగా ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్, డీజీపీ సూచించిన మరో సభ్యుడు ఉంటారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సిట్ తన దర్యాప్తు నివేదికను డీజీపీకి అందజేయాలి. భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణకు సిట్‌కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.





