విశాఖపట్నం మధురవాడలో నిండు గర్భిణి అనూష (27) తన భర్త గెద్దాడ జ్ఞానేశ్వర్ చేతిలో దారుణంగా హత్యకు గురైంది. 2022లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన వీరి వివాహాన్ని జ్ఞానేశ్వర్ తన తల్లిదండ్రులకు దాచాడు. అనూషను వారికి పరిచయం చేయకుండా, నగరంలో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. ఆమె అత్తమామలను కలవాలని అడిగినప్పుడల్లా కారణాలు చెప్పి తప్పించుకునేవాడు. ఓసారి క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, విడాకులు తీసుకోమని కూడా ఆమెను మోసం చేయడానికి ప్రయత్నించాడు.
“అనూషను వదిలించుకోవాలని చాలాసార్లు యత్నించా, కానీ ఆమె వినలేదు,” అని జ్ఞానేశ్వర్ పోలీసుల విచారణలో నేరం అంగీకరిస్తూ చెప్పాడు.
హత్య వెనుక కథ
సోమవారం ఆసుపత్రిలో చేరాల్సిన అనూష, తోడుగా ఉండేందుకు తన అమ్మమ్మను రెండు రోజుల క్రితం ఇంటికి పిలిచింది. ఆదివారం రాత్రి భర్తతో కలిసి నిద్రించిన ఆమెను, తెల్లవారుజామున జ్ఞానేశ్వర్ గుడ్డతో పీక నులిమి హత్య చేశాడు. ఉదయం ఆమె లేవకపోవడంతో అమ్మమ్మ అనుమానించగా, అతడు ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పీఎం పాలెం పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. అనూషకు తల్లికి చూపు లేకపోవడం, తండ్రి నాలుగేళ్ల క్రితం మరణించడంతో ఆమె ఒంటరిగా ఉండేది. ఈ పరిస్థితుల్లో జ్ఞానేశ్వర్ ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.





