- ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు పెట్టుబడిపై ప్రజలు నిలదీస్తున్నారని విమర్శ.
- జగనన్న 2.0 ద్వారా కార్యకర్తలకు అండగా ఉంటానని జగన్ స్పష్టం. టీడీపీ హామీల అమలుపై ప్రశ్నలు
టీడీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి కింద రూ.18 వేలు, నిరుద్యోగ భృతి కింద రూ.36 వేలు, అన్నదాతా సుఖీభవ కింద రూ.20 వేల పెట్టుబడి ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఏ ఇంటికెళ్లినా టీడీపీ నాయకులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
“సూపర్ సిక్స్” మోసం – జగన్
టీడీపీ ప్రకటించిన పథకాలకు రూ.1.72 లక్షల కోట్లు అవసరమవుతుందని, అవి అమలు కావడం అసాధ్యమని తాము ఎన్నికల సమయంలోనే చెప్పినట్టు జగన్ గుర్తు చేశారు. “చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే” అంటూ గతంలో తాను చేసిన హెచ్చరిక నిజమైందని అన్నారు. ప్రజల నమ్మకాన్ని దోచుకున్న చంద్రబాబు ఇప్పుడు చేతులెత్తేశారని ఆరోపించారు. ప్రస్తుతం కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనిస్తున్నానని, త్వరలోనే వారికి అండగా నిలబడతానని జగన్ హామీ ఇచ్చారు. గత పాలనలో ప్రజల కోసమే కృషి చేశానని, ఇకపై కార్యకర్తలకూ మరింత సహాయపడతానని చెప్పారు.





