- నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు
- ప్రణయ్‌ను హత్య చేసిన సుభాష్‌కుమార్‌శర్మకు ఉరిశిక్ష
2018లో మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం, రెండో అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు ప్రకటించింది. ప్రధాన నిందితుడు సుభాష్‌కుమార్‌శర్మకు ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవితఖైదు విధించింది. హత్యకు సుపారీ ఇచ్చిన అమృత తండ్రి మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకోవడంతో విచారణలో అతనిపై కేసు నిలిపివేశారు. మిగతా నిందితుల్లో సుభాష్‌కుమార్‌శర్మకు ఉరిశిక్ష, రూ.15 వేల జరిమానా, మిగతా ఆరుగురికి జీవితఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు.
చంపడమే లక్ష్యంగా..!
ప్రణయ్‌ను హత్య చేసేందుకు మారుతీరావు తన కుటుంబ సభ్యులతో కలిసి నిందితులను నియమించాడు. గుజరాత్ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులుగా ఉన్న అస్గర్ అలీ, మహ్మద్ అబ్దుల్ బారీల ద్వారా బిహార్‌కు చెందిన సుభాష్‌కుమార్‌శర్మను రంగంలోకి దించారు. 2018 సెప్టెంబర్ 14న, ప్రణయ్ ఆసుపత్రి బయటకు రాగానే, సుభాష్‌కుమార్‌శర్మ అతడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. దీంతో, దేశవ్యాప్తంగా దుమారం రేగిన ఈ కేసుకు చివరికి న్యాయం జరిగిందని, హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించడం బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చిందని పబ్లిక్ అభిప్రాయపడుతోంది.





